

ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయన్న ఆరోపణలపై ఖతార్ స్పందించింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు అరబ్ ఓటర్లకు నిధులు సమకూర్చిందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కొందరు ఇజ్రాయెల్ రాజకీయ నేతలు, మీడియా వర్గాలు తమ దేశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని రాజకీయ వివాదాల్లోకి ఖతార్‌ను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొందరు నేతల వైఫల్యాలకు తమ దేశాన్ని బలిపశువును చేయొద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఖతార్, తుర్కియే నుంచి నిధులు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఇజ్రాయెల్ మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ ఆదేశించడంతో, ఆ దేశ అంతర్గత భద్రతా విభాగం షిన్ బెట్ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. అయితే, ఎన్నికల్లో విదేశీ జోక్యంపై వచ్చిన ఆరోపణలు ఇంకా దర్యాప్తు పరిధిలోనే ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!