

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొత్తగా నియమితులైన ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో నిర్వహించిన డీఎస్పీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై పనిచేయాలని, వారి పనితీరే ప్రభుత్వానికి గీటురాయిగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం సులభమవుతుందని తెలిపారు. పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా 'క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్' హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించి, ప్రతిభ కనబరిచిన ట్రెయినీ డీఎస్పీలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సీఎం సూచించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, ఆహార భద్రత వంటి రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసమే ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారుల నైపుణ్యాలకు అనుగుణంగా ప్రత్యేక పోలీసు విభాగాల్లో అవకాశాలు కల్పించడంతో పాటు అవసరమైతే దేశ, విదేశాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు, గ్రూప్-1 నియామకాలను పారదర్శకంగా పూర్తి చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. ఒకేసారి 562 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయగా, వారిలో 119 మంది డీఎస్పీలుగా ఎంపికయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!