

కోయంబత్తూరులో నిషేధిత గుట్కా తరలిస్తున్న నిందితులను పట్టుకునే క్రమంలో సాహసం ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ ఎం. వేలుమురుగన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అభినందించారు. కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వేలుమురుగన్, సెప్టెంబర్ 27న వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద ఎస్‌యూవీని ఆపేందుకు ప్రయత్నించారు. కర్ణాటక నుంచి గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు తనిఖీ చేపట్టగా, వాహనంలోని ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కారును వేగంగా ముందుకు తీసుకెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వేలుమురుగన్ కారు పైకప్పుపైకి ఎక్కి రూఫ్ రైల్స్‌ను గట్టిగా పట్టుకున్నారు.
నిందితులు వాహనాన్ని ఆపకుండా దాదాపు 40 కిలోమీటర్ల మేర వేగంగా నడిపినా, వేలుమురుగన్ పట్టువదలకుండా కారుపైనే ఉన్నారు. చివరకు పోలీసుల సమన్వయంతో వాహనాన్ని అడ్డుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో చూపిన ధైర్యం, విధి పట్ల నిబద్ధత, సమయస్ఫూర్తిని సీఎం విజయ్ ప్రశంసిస్తూ వేలుమురుగన్‌ను చెన్నై సచివాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. రాష్ట్ర పోలీసు డీజీపీ మహేశ్ కుమార్ అగర్వాల్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!