

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తల్లో కొందరిని ఎలాంటి సిఫారసులు లేకుండా నేరుగా నామినేటెడ్ పదవులకు ఎంపిక చేయనున్నట్లు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన ఆరు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో కార్యకర్తల పనితీరును ప్రామాణికంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ చేపడతామని చెప్పారు. మొత్తం ఆరు కార్యక్రమాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి అవార్డులు పొందిన వారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, అనంతరం ఐదు, నాలుగు కార్యక్రమాల్లో అవార్డులు సాధించిన వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే సుమారు 150 మందిని ప్రాథమికంగా గుర్తించామని, ఈ ప్రతిపాదనకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు.
కార్యకర్తలకు తెదేపా మొదటి నుంచీ ప్రాధాన్యం ఇస్తోందని, వారి సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని లోకేశ్ తెలిపారు. ఎమ్మెల్యేలు నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నామని, ఆదేశాలను పాటించని వారిని హెచ్చరిస్తున్నామని చెప్పారు. కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించామని, భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలోనూ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాలను పూర్తి చేసి, అనంతరం రెండో దశ సమావేశాలను ప్రారంభిస్తామని లోకేశ్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!