

రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా పట్టణాలను అభివృద్ధి చేయడంపై చర్చించారు. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KFW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ముఖ్యంగా టెక్స్‌టైల్ పార్కులకు సరఫరా చేయడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు. వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10–12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుతో పాటు బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ప్రతిపాదనలను కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, పట్టణాల్లో వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!