

దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. అర్ధరాత్రి సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 1,760కి చేరినట్లు సమాచారం. తెల్లవారుజామున 4:30 గంటల సమయానికి అది 1,326కి తగ్గినప్పటికీ, ప్రస్తుతం సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా నమోదైంది. ప్రాంతాల వారీగా సోనియా విహార్‌లో అత్యధికంగా 463 AQI నమోదవగా.. బురారీ క్రాసింగ్‌లో 452, జహంగీర్‌పురిలో 447గా ఉంది. గాలుల వేగం తగ్గడంతో వాతావరణంలో విషపూరిత కాలుష్య కణాలు పేరుకుపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించి ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచినట్లు సమాచారం.
పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-3 ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాణ పనులపై పరిమితులు విధించడంతో పాటు పాత వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీపావళి అనంతరం గాలి నాణ్యత ఒక్కసారిగా క్షీణించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాలుల వేగం తగ్గడం, కాలుష్య ఉద్గారాలు పెరగడం వంటి పరిస్థితులు ఢిల్లీ వాయు నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!