

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల సందర్భంగా టపాసులు కాల్చుతూ 15 మంది కంటి గాయాలకు గురయ్యారు. గాయపడిన వారంతా మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి చికిత్స కోసం చేరుకున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రిని ఆశ్రయించిన 15 మందిలో ఐదుగురిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోగా, మరో 10 మందికి ఓపీ విభాగంలో చికిత్స అందించి పంపించారు. ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో నలుగురు చిన్నారులు, ఒకరు పెద్దవారు ఉన్నారు. అయితే ఎవరికీ చూపు కోల్పోయేంత తీవ్రమైన గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు.
దీపావళి వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో టపాసుల వల్ల మరిన్ని కంటి గాయాల కేసులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. బాధితులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలని వైద్యులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!