

హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అథారిటీ (టీజీ సేఫ్) గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించింది. కోర్ అర్బన్ రీజియన్‌లోని 15 ప్రముఖ రెస్టారెంట్లలో 8 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టగా.. పలు చోట్ల తీవ్ర ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు బయటపడ్డాయి. దీంతో 8 హోటళ్ల లైసెన్సులు రద్దు చేయడంతోపాటు బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేకుండా నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్‌లో బొద్దింకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
గచ్చిబౌలిలోని అరోమా మల్టీకుసిన్ రెస్టారెంట్‌లో ఎలుకలు కొరికిన ఆహార పదార్థాలు, రెస్టారెంట్‌లో పిల్లుల సంచారం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. రాయదుర్గంలోని పక్వాన్ గ్రాండ్ రెస్టారెంట్‌లో 1,170 గడువు ముగిసిన బియ్యం బస్తాలు, 45 కిలోల లేబుల్ లేని నూడిల్స్, కుళ్లిన కోడిగుడ్లు లభించాయి. హఫీజ్‌పేట్‌లోని గోదావరి ఘుమఘుమలు రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన కూరగాయలు, అపరిశుభ్రమైన వంటగదిని గుర్తించారు. గచ్చిబౌలిలోని శ్రీకృష్ణ ఫ్యామిలీ డాబాలో సిబ్బంది గుట్కా నములుతుండగా.. బూజుపట్టిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండాపూర్‌లోని శ్రీ సాయిమెస్-బాబాయ్ హోటల్‌లో కుళ్లిన కూరగాయలు, ఈగలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. సఫిల్‌గూడలోని ఆదిత్య రెస్టారెంట్ అండ్ బార్‌లో దెబ్బతిన్న ఫ్లోరింగ్, పెచ్చులు ఊడిన గోడలు, కుళ్లిన కూరగాయలు కనిపించాయి. కొత్తపేటలోని స్పైసీ హబ్/గ్రీన్ ట్రీట్‌లో దుర్వాసన వస్తున్న ఫ్రిజ్‌లు, గడువు తీరిన ఆహార పదార్థాలు లభించాయి. బేగంబజార్‌లోని వైష్ణవి దర్శినిలో బూజుపట్టిన ఆహార పదార్థాలతోపాటు సరైన వెలుతురు లేకపోవడం, రసాయనాలు మరియు ఆహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం గుర్తించారు.
పుప్పాలగూడలోని అసోనియో ఇండియన్ కిచెన్‌కు టీజీ సేఫ్ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. వాటిలో గచ్చిబౌలిలోని గర్ల్‌ఫ్రెండ్ మండీ, యూసుఫ్‌గూడలోని బాక్స్ 8 మోజో పిజ్జా, హైటెక్ సిటీలోని సీజన్స్ ఎక్స్‌ప్రెస్, సైనిక్‌పురిలోని యమ్మీబీ, గుండిమైసమ్మలోని జేఎమ్‌జే బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. ఈ సంస్థల్లో త్వరలో మరోసారి తనిఖీలు నిర్వహిస్తామని, అప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. కల్తీ అనుమానం ఉన్న 16 ఆహార నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!