

2008 నవంబరు 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏకైక బ్రిటిష్ పౌరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రియాస్ లివెరాస్ జీవిత కథ పుస్తక రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన మనవరాలు తాన్యా లివెరాస్ ఈ పుస్తకాన్ని రచించారు. ముంబయి ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ది విజన్: వన్ మ్యాన్స్ ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ అండ్ ది సీజ్ దట్ షుక్ ది వరల్డ్’ పేరుతో ఈ పుస్తకం విడుదల కానుంది. సైప్రస్‌లోని పేద కుటుంబంలో జన్మించిన ఆండ్రియాస్.. బ్రిటన్‌లో బేకరీతో పాటు పలు వ్యాపారాలను అభివృద్ధి చేసి బిలియనీర్‌గా ఎదిగారు. వ్యాపార విస్తరణలో భాగంగా ముంబయికి వచ్చిన ఆయన.. 2008 నవంబరు 26న తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు.
ఆండ్రియాస్ జీవిత విశేషాలతో పాటు ముంబయి దాడుల్లో ఆయన ఎదుర్కొన్న చివరి గంటల గురించి కూడా తాన్యా ఈ పుస్తకంలో వివరించారు. దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన 50 మందికి పైగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వారితో జరిపిన సంభాషణలు, అధికారిక రికార్డుల ఆధారంగా పుస్తకాన్ని రూపొందించారు. చిన్నప్పటి నుంచి తన తాతకు ఓ భయంకరమైన పీడకల తరచూ వచ్చేదని తాన్యా వెల్లడించారు. పరాయి దేశంలో ఓ చీకటి గదిలో అపరిచిత వ్యక్తి తుపాకీకి తాను బలవుతున్నట్లు ఆయన కలలు కనేవారని, చివరకు అదే నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకం ద్వారా తన తాత జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్న విషాదకరమైన ముగింపును ప్రపంచానికి తెలియజేయాలని తాన్యా భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!