

కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులే నేటికీ తెలంగాణ రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తున్నాయని, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి కావడానికి అవే ప్రధాన ఆధారమని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలను అందించలేకపోయిందని పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీకి పునాదులని, అంకితభావంతో పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం పార్టీలో ఉంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడానికి మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, వచ్చే వర్షాకాలం వరకు తాగునీరు, ఇతర అత్యవసర అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
మరోవైపు, రూ.13 వేల కోట్లతో చెరువుల పూడికతీత, మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీఏసీ సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. ఈ పనులకు సంబంధించిన బిల్లులు, నిధుల విడుదలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతల మధ్య సరదా సంభాషణలు కూడా చోటుచేసుకున్నాయి. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి పిల్లలు లేరని, ఆయన తనను దత్తత తీసుకుంటే ఆయన ఇంటికి వెళ్తానని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. దీనికి ఉత్తమ్ తన అప్పులను కూడా స్వీకరించాల్సి ఉంటుందని సరదాగా స్పందించగా, మహేశ్‌కుమార్‌గౌడ్ అందుకు సిద్ధమేనని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ సంభాషణలో పాల్గొని నవ్వులు పంచారు. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పనితీరు బాగుందని ఏఐసీసీ మాజీ ఇన్‌ఛార్జి మీనాక్షీనటరాజన్ వీడియో సందేశం ద్వారా ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, తన పోరాటం ఆగదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన సోషల్ మీడియా పోస్ట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!