

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా శ్రావణ భార్గవితో విడాకులపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తమ విడాకులపై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, తామిద్దరం ఈ విషయంపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశం కాదని తెలిపారు.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సంచలనాత్మక థంబ్‌నైల్స్‌తో కుటుంబ విషయాలను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని హేమచంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమ కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని కోరుకుంటున్నట్లు చూపించిన ఓ థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ.. తమ ఇంట్లో జరగని విషయాన్ని ఇతరులు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించారు. ఇలాంటి కంటెంట్ కుటుంబ సభ్యులను, ముఖ్యంగా పిల్లలను అనవసరమైన ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.
వివాదాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపైనా హేమచంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత విషయాలను వెంటనే పబ్లిక్ డొమైన్‌లో చర్చించకుండా కొంత సమయం తీసుకుని ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి విషయాలను మీడియాలో పదేపదే చర్చించడం వల్ల సెలబ్రిటీలతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన భావోద్వేగాలను అర్థం చేసుకోవాలంటే ‘ADHD’ ఆల్బమ్‌ను వినాలని, అందులోని ‘You Are Mine’ పాట తన భావోద్వేగ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని హేమచంద్ర పేర్కొన్నారు. అలాగే శ్రావణ భార్గవి అద్భుతమైన పాప్ ఆర్టిస్ట్ అని ప్రశంసించారు. ఆమె పూర్తి ప్రతిభను ఇంకా చాలామంది చూడాల్సి ఉందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!