

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చేపట్టిన 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 నిర్మాణ పనుల టెండర్ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ కాంట్రాక్టును పొందిన ఎల్-1 బిడ్డర్‌ను కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. టెండర్ ప్రక్రియలో సాంకేతిక, ఆర్థిక బిడ్‌లలో అర్హత సాధించిన కాంట్రాక్టర్ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకముందే టెండర్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. సాంకేతిక బిడ్‌లో తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ, అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని సరిగా పరిశీలించకుండానే తమ సంస్థను అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం పత్రాల్లో సందేహాలుంటే వివరణ కోరాల్సి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ కంటే రూ.600 కోట్లు తక్కువగా కోట్ చేశామని, తమ వాదనను పరిగణనలోకి తీసుకోకపోతే ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, సాంకేతిక అర్హతలు లేకపోవడంతోనే పిటిషనర్ బిడ్‌ను తిరస్కరించినట్లు అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సాంకేతిక అర్హత ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!