

ఒకప్పుడు అట్లాంటిక్ సముద్రయానంలో ప్రపంచ రికార్డు సృష్టించిన చారిత్రక అమెరికన్ నౌక ‘ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్’ ఇప్పుడు సముద్ర గర్భంలో మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. 990 అడుగుల పొడవున్న ఈ నౌకను ఫ్లోరిడాలోని డెస్టిన్-ఫోర్ట్ వాల్టన్ బీచ్ తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ముంచనున్నారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మారనుంది. దశాబ్దాలుగా ఈ నౌకను సంరక్షించేందుకు కృషి చేస్తున్న ‘ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్ కన్సర్వెన్సీ’ సంస్థ.. ఫ్లోరిడా తీరంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నౌకకు సంబంధించిన చారిత్రక వస్తువులు, భాగాలను అందులో ప్రదర్శించనుంది. ఇందులో భాగంగా రెండు భారీ పొగ గొట్టాలను ఇప్పటికే తొలగించి భద్రపరిచారు.
టైటానిక్ కంటే పెద్దదైన ఈ నౌకను విలాసవంతమైన ప్రయాణాలతోపాటు అత్యవసర సమయాల్లో సైనిక బలగాల రవాణాకు ఉపయోగించేలా రూపొందించారు. నేవల్ హిస్టారికల్ ఫౌండేషన్ ప్రకారం.. 1950లో ప్రారంభమైన దీని నిర్మాణానికి 70 మిలియన్ డాలర్లకుపైగా ఖర్చయింది. సాధారణంగా 1,900 నుంచి 2,000 మంది ప్రయాణికులను, యుద్ధ సమయాల్లో 14 వేల మంది సైనికులను తరలించే సామర్థ్యం దీనికి ఉంది. 1952లో తొలి ప్రయాణంలో న్యూయార్క్ నుంచి ఐరోపాకు కేవలం మూడు రోజులు, 11 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షులు హ్యారీ ట్రూమన్, డ్వైట్ ఐసెన్‌హోవర్, జాన్ ఎఫ్. కెన్నడీ, బిల్ క్లింటన్ ఈ నౌకలో ప్రయాణించారు. 1969లో సేవల నుంచి వైదొలిగిన తర్వాత పలువురు యజమానుల చేతులు మారిన ఈ నౌక.. దశాబ్దాల పాటు అట్లాంటిక్ ఓడరేవుల్లో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్లపాటు ఫిలడెల్ఫియా షిప్‌యార్డ్‌లో ఉన్న అనంతరం 2024లో దాన్ని తుక్కుగా విక్రయించాలా? కృత్రిమ పగడపు దిబ్బగా మార్చాలా? అనే ప్రశ్న తలెత్తింది. చివరకు ఫ్లోరిడాలోని ఒకలూసా కౌంటీ ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. గతేడాది ఫిలడెల్ఫియా నుంచి తరలించిన ఈ నౌకను సముద్ర పర్యావరణానికి హాని కలగకుండా సిద్ధం చేశారు. లోపలి భాగాలను ఖాళీ చేయడంతోపాటు ప్రమాదకర పదార్థాలను తొలగించారు. ఈ ప్రాజెక్టుతో చేపల వేట, డైవింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఒకలూసా కౌంటీ ఆశిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!