

హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణం రానుంది. తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేడియాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే అధిక సామర్థ్యంతో దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టేడియం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో మార్గం, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ ప్రణాళికల్లో ఈ స్టేడియం కీలక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. క్రికెట్ మ్యాచ్‌లతో పాటు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా దీనిని మల్టీపర్పస్ వేదికగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుండగా, నిర్మాణం మరియు నిర్వహణ వ్యయాలను బీసీసీఐ భరించే అవకాశం ఉంది. భారీ స్థాయిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!