

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి సరికొత్త రికార్డు సృష్టించాయి. రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్ల ధర పలికింది. వారం క్రితం ఇదే ప్రాంతంలోని సమీప ప్లాట్‌లో ఎకరానికి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.269 కోట్ల ధర నమోదైంది. రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని 5.38 ఎకరాల భూమికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. ఎకరానికి రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించగా.. రూ.10 కోట్ల ముందస్తు మొత్తాన్ని చెల్లించిన వారికి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఈ వేలంలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడ్డాయి. చివరికి వంశీరాం బిల్డర్స్ ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున మొత్తం 5.38 ఎకరాలను దక్కించుకుంది. దీంతో ఈ లావాదేవీ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,447 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ ఐటీ, వాణిజ్య కారిడార్‌లో ప్రీమియం భూములకు కొనసాగుతున్న భారీ డిమాండ్‌కు ఈ వేలం మరోసారి నిదర్శనంగా నిలిచింది. రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు వరుసగా కొత్త రికార్డులు నమోదు చేస్తుండటం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!