

సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాలు చేపట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఐఐటీ-హైదరాబాద్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యం. వాహనాలు, పాదచారుల రాకపోకలు, ట్రాఫిక్ సర్క్యులేషన్, పార్కింగ్, ప్రయాణికుల ఎక్కింపు-దింపింపు ఏర్పాట్లు, జంక్షన్లు, సిగ్నళ్లు, ట్రాఫిక్ అవరోధాలు, స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు.
డ్రోన్ నిఘా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సీసీటీవీ విశ్లేషణ, క్షేత్రస్థాయి సర్వేలు, ట్రాఫిక్ సిమ్యులేషన్లను ఉపయోగించి డేటా ఆధారిత పరిష్కారాలను రూపొందించనున్నారు. ఇవి ప్రయాణికుల భద్రత, అందుబాటుదనం, స్టేషన్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆర్పీఎఫ్, ఆపరేటింగ్ విభాగాలు, ఇతర భాగస్వాముల సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలకు డేటా ఆధారిత పరిష్కారాలను అందించడంలో ఈ అధ్యయనం కీలకమని డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ తెలిపారు. భవిష్యత్‌లో ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ ఇలాంటి పరిష్కారాలను అమలు చేసే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని ఆధునిక సాంకేతికతతో సమర్థంగా నిర్వహించేందుకు ఐఐటీ-హైదరాబాద్‌తో కలిసి చేస్తున్న ఈ కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!