

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం 70 లక్షల ఇళ్ల లక్ష్యానికి చేరువైంది. నవంబర్ 26 నాటికి దేశవ్యాప్తంగా 69.10 లక్షల ఇళ్లకు ఈ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ సదుపాయం అందినట్లు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.37,989 కోట్ల సబ్సిడీని లబ్ధిదారులకు విడుదల చేసింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20.2 గిగావాట్లకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ఫలకాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 30 లక్షల ఇళ్లకు ఈ పథకాన్ని విస్తరించాల్సి ఉంది.
పీఎం సూర్యఘర్ డ్యాష్‌బోర్డు గణాంకాల ప్రకారం నవంబర్ 27 నాటికి 9.89 లక్షల ఇన్స్టాలేషన్లతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 9.56 లక్షల ఇన్స్టాలేషన్లతో గుజరాత్ రెండో స్థానంలో, 9.43 లక్షలతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణతో పాటు వాటిని వాస్తవ ఇన్స్టాలేషన్లుగా మార్చడంలో తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. కోటి రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్ల ద్వారా 25 ఏళ్లలో లక్ష కోట్ల యూనిట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. దీనివల్ల 72 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!