

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 6 నుంచి 14వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నవాహ్నిక విధానంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా డిసెంబర్ 1న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. ఉత్సవాల మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వాహన సేవల్లో చిన్నశేష, పెద్దశేష, హంస, ముత్యపుపందిరి, సింహ, కల్పవృక్ష, హనుమంత, గజ, సర్వభూపాల వాహనాలు ఉంటాయి. డిసెంబర్ 11న సాయంత్రం స్వర్ణరథం, గరుడ వాహన సేవలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 13న రథోత్సవం, అశ్వ వాహన సేవ జరగనుండగా, చివరి రోజైన 14న పంచమీ తీర్థం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. డిసెంబర్ 15న పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలోని బంగారు పద్మం నుంచి ఆవిర్భవించినట్లు భక్తుల విశ్వాసం. ఈ కారణంగా ఈ ప్రాంతానికి తొలుత పద్మావతిపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమంలో అది తిరుచానూరుగా మారిందని చెబుతారు. అమ్మవారి ఆలయం వెనుక భాగంలో పద్మసరోవర పుష్కరిణి ఉంది. కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో అమ్మవారు బంగారు పద్మం నుంచి ఆవిర్భవించారని పురాణ ప్రతీతి. ఈ పవిత్ర ఘట్టానికి గుర్తుగా పంచమీ తీర్థానికి ముందు తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 14న పంచమీ తీర్థం సందర్భంగా పద్మసరోవరంలో చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తిరుచానూరుకు చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు చక్రస్నానంలో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పలు సేవలను రద్దు చేసింది. డిసెంబర్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. అలాగే డిసెంబర్ 5 నుంచి 16వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలను నిలిపివేయనున్నారు. భక్తులు ఈ మార్పులను ముందుగానే గమనించి, టీటీడీ అధికారులకు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!