

తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు ఎదుర్కొంటున్న థియేటర్ల కొరత, విడుదల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ సినిమాలకు ప్రైమ్‌టైమ్‌లో తప్పనిసరిగా ప్రదర్శన అవకాశాలు కల్పిస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని సూచించారు. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో ప్రత్యేక విధానం ఉండాలని, తద్వారా చిన్న నిర్మాతలకు తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి షిరాజ్ మెహదీ మాట్లాడుతూ, 2012లో ‘పార్సెల్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యానని, అప్పటి నుంచి నటన, దర్శకత్వం, సంగీతం, పంపిణీ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. కొత్తగా సినిమాలు నిర్మించే వారు కథ, చిత్రీకరణపైనే కాకుండా విడుదల, థియేటర్ వ్యాపారం, మార్కెటింగ్ అంశాలపై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ చిన్న నిర్మాతలకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపారపరమైన సహకారం అందించడం లేదని ఆయన ఆరోపించారు. సభ్యత్వ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, నిర్మాతలు సమస్యల్లో ఉన్నప్పుడు తగిన మద్దతు లభించడం లేదని విమర్శించారు. గత ఏడాదిన్నరగా ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నానని, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్‌తో పాటు పరిశ్రమలోని పలువురికి న్యాయపరమైన నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. తన ప్రయత్నాలకు పలువురు నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారుల మద్దతు లభిస్తోందని తెలిపారు.
సినిమా నిర్మాణంలో నష్టాలు ఎదురైనంత మాత్రాన ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో అన్యాయం జరిగితే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ సమస్యలను వెల్లడించాలని సూచించారు. చిన్న సినిమాల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని మరోసారి కోరారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ వ్యవహారాలపై స్పందిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే వారే బాధ్యతల్లో ఉండాలని, సి. కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న విధానం ప్రకారం, ప్రతి సినిమా హాల్‌తో పాటు మల్టీప్లెక్స్‌లోని ప్రతి స్క్రీన్‌పై మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య రోజుకు కనీసం ఒక బెంగాలీ సినిమా ప్రదర్శన తప్పనిసరి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేసే వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!