

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమాజ్‌వాదీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. లఖ్‌నవూలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మేనిఫెస్టోను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు లభించే వరకు నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యువతకు ఉద్యోగ ఆధారిత నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అవకతవకలను అరికడతామని ప్రకటించారు. రాష్ట్రంలో కులగణన చేపడతామని కూడా హామీ ఇచ్చారు.
రైతులకు తక్షణ రుణమాఫీతో పాటు 23 రకాల పంటలు, పాలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధ మహిళలు, కార్మికులు, మహిళా కార్మికులు, కళాకారులకు ఏడాదికి రూ.40 వేల పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజ్‌వాదీ క్యాంటీన్లలో పేదలు, మహిళలకు రూ.5కే భోజనం అందిస్తామని, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోతో పాటు జిల్లాల వారీగా కూడా ప్రత్యేక ఎన్నికల ప్రణాళికలను విడుదల చేయనున్నట్లు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!