

ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా భారత్ ఎదుగుతున్నప్పటికీ, ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలమైన ఆర్థిక పునాదులు, ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం, నిరంతర సంస్కరణలే దేశ పురోగతికి ప్రధాన ఆధారాలని తెలిపారు. మంగళవారం బ్లూమ్బెర్గ్ నూతన ఆర్థిక వేదిక సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, వ్యూహాత్మక వనరుల కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు చూపగలవని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిందని, విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయని వెల్లడించారు. పన్నులు, కార్మిక, దివాలా చట్టాల్లో సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా మారిందని వివరించారు.
భారత్ ఆర్థిక, సాంకేతిక శక్తిని ఇతరులను నియంత్రించేందుకు కాకుండా, వారికి అవకాశాలు కల్పించేందుకు వినియోగిస్తోందని మోదీ స్పష్టం చేశారు. వీధి వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారవేత్తల వరకు అందరూ ఒకే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకోవడం సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనమన్నారు. కోవిడ్ సమయంలో అభివృద్ధి చేసిన కోవిన్ వేదికతో పాటు 100కు పైగా దేశాలకు టీకాలు సరఫరా చేయడం ద్వారా భారత్ అంతర్జాతీయ సహకారాన్ని చాటిందని తెలిపారు. 2014కు ముందు కొన్ని వందలుగా ఉన్న అంకుర సంస్థల సంఖ్య ప్రస్తుతం 2.5 లక్షలు దాటిందని, వాటిలో సగానికి పైగా చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్నాయని చెప్పారు. దాదాపు 45 శాతం అంకుర సంస్థల్లో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా లేదా భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి ఐదు జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత్లో ఉత్పత్తి అవుతోందని, దేశంలో 2,000కు పైగా గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!