

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో జై రాజ్ ఇస్పాత్ పరిశ్రమ కార్యకలాపాలు పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో ఈ సంస్థకు భూములు కేటాయించగా, 2018 మేలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సుమారు 430 ఎకరాల్లో రూ.2,100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటైన ఈ సమీకృత ఉక్కు పరిశ్రమలో ఆసియాలోనే తొలిసారిగా ఎండ్‌లెస్ కాస్టింగ్ అండ్ రోలింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమ ప్రాంగణంలో మూడో వంతు భూమిని పచ్చదనానికి కేటాయించడంతో పాటు, వర్షపు నీటి నిల్వ కోసం 45 ఎకరాల్లో జలాశయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెండో దశలో మరో 600 ఎకరాల్లో రూ.3,378 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించనున్నారని, తద్వారా అదనంగా 934 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.
ప్రస్తుతం జై రాజ్ ఇస్పాత్‌లో పనిచేస్తున్న వారిలో 65 శాతం మంది స్థానికులేనని నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. శ్రీనివాసు, ఇంజనీర్‌గా పనిచేస్తున్న డి. సింధూజ వంటి స్థానిక యువతకు సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు లభించడం ప్రభుత్వ లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జై రాజ్ ఇస్పాత్ రాకతో ఓర్వకల్లులో పారిశ్రామిక పెట్టుబడులకు మార్గం సుగమమైందని, రిలయన్స్ సంస్థ పానీయాల తయారీ పరిశ్రమను, జాక్సన్, అగస్త్య గ్రీన్ ఎనర్జీ సంస్థలు సౌర విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. మరోవైపు ఓర్వకల్లు డ్రోన్ సిటీగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాయలసీమను రాష్ట్రంలోనే ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!