

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రామాయపట్నంలో అత్యాధునిక రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టును రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల (9 MMTPA) శుద్ధి సామర్థ్యంతో రిఫైనరీని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు దేశీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భారతదేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
ఈ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. భారీ పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కీలక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!