

భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో 32 నుంచి 33 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 నుంచి 6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ కె. రాజా భాను వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సీపీహెచ్‌ఐ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. అమెరికాకు ఎగుమతులు కొంత మందగించినప్పటికీ, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో కొత్త మార్కెట్లను భారత్ అభివృద్ధి చేసుకుంటోందని చెప్పారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా వ్యవస్థల్లో సమస్యలు ఎదురైనా, వివిధ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ భారత్ వాటిని అధిగమించిందని రాజా భాను తెలిపారు. మరోవైపు, భారత ఫార్మా పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 9.2 శాతం వృద్ధితో రూ.5.08 లక్షల కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించిందని ఇన్ఫోర్మా మార్కెట్స్ ఎండీ యోగేశ్ ముద్రాస్ వెల్లడించారు. వైద్య పరికరాల తయారీ రంగం కూడా 48.2 శాతం పెరిగింది. 2019-20లో రూ.28,000 కోట్లుగా ఉన్న ఈ రంగం విలువ 2024-25 నాటికి రూ.41,500 కోట్లకు చేరింది. అధునాతన బయోలాజిక్స్, ప్రత్యేక చికిత్సలు, సంక్లిష్ట ఔషధ తయారీ వంటి అధిక విలువ కలిగిన రంగాల్లోకి విస్తరించడం ద్వారా భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో సోమవారం ప్రారంభమైన సీపీహెచ్‌ఐ ఇండియా 2026 సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఈసారి ఐఐసీసీ, ఇండియా ఎక్స్‌పో మార్ట్ అనే రెండు వేదికల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 120కి పైగా దేశాల నుంచి 2,000 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటుండగా, సుమారు 50 వేల మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!