

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో మంగళవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. లక్షలాది దీపాల కాంతులతో ఇంద్రకీలాద్రి గిరిశిఖరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. కనకదుర్గ అమ్మవారి పంచహారతి సేవ అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బి. రాధాకృష్ణ దంపతులు, ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు కోటి వత్తుల మహాదీపాన్ని వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నటరాజ స్వామి, మల్లేశ్వర స్వామి ఆలయాల ప్రాంగణాల్లోనూ దీపాలను వెలిగించారు. మహామండపం నుంచి కనకదుర్గ నగర్ వరకు ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు భక్తిశ్రద్ధలతో వెలిగించి స్వామివార్లకు నమస్కరించారు. పున్నమి వెన్నెలలో సంప్రదాయ ఆలయ నృత్య కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఛైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా దీపోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్తీక మాసంలో ఈ వేడుకకు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. భక్తుల భద్రత కోసం దేవస్థానం పరిధిలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఈవో శీనా నాయక్ వెల్లడించారు. అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీపోత్సవం అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అత్యంత విశిష్టమైన జ్వాలా తోరణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి వేడుకలను ముగించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!