

మహబూబ్‌నగర్ జిల్లాలో జలాశయం ముంపు పరిహారం సొమ్ము కోసం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. మక్తల్‌కు చెందిన అంజమ్మతో అతడికి వివాహమైంది. ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితులైన మల్లికార్జున్ కుటుంబానికి ఇటీవల రూ.18 లక్షల పరిహారం అందింది. ఈ నెల 20న మల్లికార్జున్ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కూలీలు అతడి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో మంగళవారం అక్కడే ఖననం చేశారు.
గ్రామస్థుల కథనం ప్రకారం.. సుమారు రెండు నెలల క్రితం శ్రీశైలం వెళ్లిన సమయంలో మల్లికార్జున్‌కు మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో శివ పలుమార్లు ఉదండాపూర్‌కు వచ్చిపోయేవాడని, ఈ క్రమంలో అంజమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడిందని ఆరోపణలు ఉన్నాయి. కుటుంబానికి అందిన రూ.18 లక్షల పరిహారం సొమ్మును దక్కించుకోవాలనే ఉద్దేశంతో అంజమ్మ, శివ కలిసి మల్లికార్జున్‌ను హత్య చేయాలని పథకం వేసినట్లు సమాచారం. డబ్బును చెరిసగం పంచుకోవాలని అంజమ్మ శివకు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 20న రాత్రి కూలి పని ఉందని నమ్మించి మల్లికార్జున్‌ను పిలిపించిన శివ.. అతడిని హత్య చేసినట్లు కథనం. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!