

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సైన్యం సంచలన వీడియోను విడుదల చేసింది. ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల కొత్త లాంచర్‌ను ఇందులో ప్రదర్శించింది. ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ డబుల్ లాంచర్ వ్యవస్థను ఇరాన్ సైన్యం బహిరంగంగా చూపించడం ఇదే తొలిసారి. ఈ వీడియోలో భూగర్భంలో నిర్మించిన క్షిపణి నగరానికి సంబంధించిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్లు ఓ వాహనంలో సొరంగ మార్గం గుండా ప్రయాణిస్తూ అక్కడి ఆయుధాలను పరిశీలిస్తున్నట్లు ఫుటేజీలో ఉంది. ఈ భూగర్భ కేంద్రంలో యాంటీ షిప్ క్షిపణులు, సముద్ర మందుపాతరలు సహా పలు రకాల ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వీడియోలోనూ వివిధ ఆయుధాలను ప్రదర్శించారు. ఇలాంటి భూగర్భ క్షిపణి కేంద్రాలు ఇరాన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆ దేశం కొన్ని క్షిపణి నగరాలను ప్రపంచానికి చూపించింది.
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఆ దేశ అణు, క్షిపణి వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అవసరమైతే మరోసారి టెహ్రాన్‌పై భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ విడుదల చేసిన తాజా వీడియో.. తమ సైనిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దనే సంకేతాన్ని ఇస్తోంది. అమెరికా బలగాలతో పాటు వాటి మిత్రదేశాలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన ఆయుధాలు తమ వద్ద ఇంకా ఉన్నాయని ఇరాన్ చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆయుధాలు భూగర్భంలో చాలా లోతున భద్రపరిచినట్లు భావిస్తున్నందున వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం అమెరికాకు సవాలుగా మారవచ్చు. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నుంచి దాడులు జరిగితే వాటిని అడ్డుకోవడం అక్కడి అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!