

తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రమైన తిరువణ్ణామలైలో కార్తీక మహా దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అరుణాచలేశ్వర స్వామివారి మహా దీప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ నెల 15న ప్రారంభమైన కార్తీక దీప బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా భరణి దీపారాధన నిర్వహించారు.
సాయంత్రం ఆరు గంటలకు 2,668 అడుగుల ఎత్తైన అరుణాచల గిరి శిఖరంపై మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ దీప దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘హరహర మహాదేవ’, ‘అరుణాచల శివ’ నామస్మరణతో 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ మార్గం మార్మోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. మహా దీప దర్శనం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!