

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రానికి ప్రస్తుతం కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. విడుదలైన తొలి వారంలో వరుసగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఒక రోజులోనే రూ.150 కోట్లకు పైగా రాబట్టి రికార్డులు సృష్టించింది. అయితే ఇటీవల రోజువారీ వసూళ్లు గణనీయంగా తగ్గి రూ.12 కోట్లకు పడిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు చిత్ర బృందం టికెట్ ధరలను తగ్గించింది. గురునానక్ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటిస్తూ, మంగళవారం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో రూ.99 నుంచే టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. గతంలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న 2డీ టికెట్ల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.
సాధారణ టికెట్లతో పాటు 3డీ, ఐమాక్స్ షోల ధరలను సైతం తగ్గించినట్లు సమాచారం. ప్రీమియం, రిక్లైనర్ సీట్లకు మాత్రం కొంత ఎక్కువ ధర కొనసాగుతోంది. రిక్లైనర్ టికెట్లు సుమారు రూ.199 నుంచి రూ.249 వరకు అందుబాటులో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో 3డీ టికెట్లు రూ.119 నుంచి రూ.249 మధ్య ఉన్నాయి. కొన్ని థియేటర్లలో ఐమాక్స్ 3డీ టికెట్ల ధరలు కూడా తగ్గాయి. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ధరలు లేవు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు ప్రస్తుతం కలెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో టికెట్ ధరల తగ్గింపు ఎంతవరకు ప్రేక్షకులను ఆకర్షించి వసూళ్లను పెంచుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!