

భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి చేపట్టిన రూ.1,090 కోట్ల ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ పనులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావించి, నెల క్రితం ఆయా మార్గాల్లో వన్‌వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. తొలుత వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మూడో రోజు నుంచి సిగ్నళ్ల వద్ద నిరీక్షణ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైన తర్వాత వందల కోట్లు ఖర్చు చేయడం అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం రూపొందించిన తీర్మానాన్ని శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం సమావేశం ఆమోదించింది. ప్రత్యేక అధికారి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు గేట్, ముగ్దా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనులను రద్దు చేశారు. కాంట్రాక్టు సంస్థలు కేఎన్‌ఆర్, మేఘాతో చేసుకున్న ఒప్పందాల రద్దుకు కూడా ఆమోదం లభించింది. ఇదే సమయంలో పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ కూడలి నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ రోడ్డును కలుపుతూ 4 కి.మీ పొడవైన ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టును డిజైన్లు పూర్తయ్యాక తుది అంచనా వ్యయం ఖరారు చేయనున్నారు. కేబీఆర్ ప్రాజెక్టు రద్దైన నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ మేఘా సంస్థకు అప్పగించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!