

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాలపై మరోసారి అధిక సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయా దేశాల ప్రభుత్వాలు తమ దేశీయ పరిశ్రమలకు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుండటమే ఇందుకు కారణమని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ పారిశ్రామిక రంగాలకు అందిస్తున్న సబ్సిడీలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమియెసన్ గ్రీర్ విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విచారణ ఫలితాల ఆధారంగా భారత్‌తో పాటు మొత్తం 16 ఆర్థిక వ్యవస్థలపై సుంకాలను పెంచే అవకాశాలను అమెరికా పరిశీలిస్తోంది. ఆయా దేశాలు తమ పారిశ్రామిక రంగాలకు సబ్సిడీలు అందించడం వల్ల తక్కువ ధరలకు ఉత్పత్తులు తయారవుతున్నాయని, దీంతో అమెరికా ఉత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాషింగ్టన్ వాదిస్తోంది. అంతేకాకుండా, ఆయా దేశాలు తమ దేశీయ అవసరాలకు మించి పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకోబోయే నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!