

కార్తిక మాసం శివభక్తులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. కార్తిక మాసంలో సప్తమి తిథి, శ్రవణా నక్షత్రం ఒకే రోజున కలిసివచ్చినప్పుడు ఆ రోజును కోటి సోమవారంగా పిలుస్తారు. పంచాంగ వివరాల ప్రకారం ఈ ఏడాది నవంబర్ 16, 2026న కార్తిక శుద్ధ సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో ఆ రోజున కోటి సోమవారాన్ని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. శివుడు, విష్ణువుల ఆరాధనకు ఈ రోజు ఎంతో విశిష్టమైనదని భక్తుల విశ్వాసం. స్కంద పురాణంలో పేర్కొన్న సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ రోజున కార్తిక సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక జన్మల పాపాలు తొలగుతాయని చెబుతారు.
కోటి సోమవారం రోజున భక్తులు సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేసి, శివాలయాలు లేదా నదీ తీరాల్లో దీపారాధన చేస్తారు. ఉపవాసం పాటిస్తూ శివారాధన, విష్ణుపూజ నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చని సంప్రదాయ ఆచారాలు సూచిస్తున్నాయి. ఈ రోజున కన్యాదానం, ఆలయ అర్చకులకు దీపదానం, అన్నదానం, గోదానం, సాలగ్రామ దానం చేయడం కూడా విశేషమైనదిగా భావిస్తారు. ఉసిరి చెట్లు ఉన్న ప్రదేశాల్లో సామూహికంగా నిర్వహించే వనభోజనాల్లో పాల్గొనడం మరో సంప్రదాయం. కోటి సోమవారం రోజున కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ విశ్వాసం. ఈ ఆచారాల ద్వారా ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అయితే, ఇక్కడ పేర్కొన్న ఫలితాలు మతపరమైన విశ్వాసాల ఆధారంగా చెప్పినవే తప్ప, అన్నింటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!