

గుజరాత్‌లోని ధారిలో ఉన్న అంబార్డీ సఫారీ పార్క్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిళ్లపై ఓ సింహాన్ని వెంబడిస్తున్న దృశ్యాలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి. దీపావళి సందర్భంగా సందర్శకులతో రద్దీగా ఉన్న సమయంలో ఓ భారీ సింహం ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో దానిని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లేందుకు అటవీశాఖ సిబ్బంది మోటార్‌సైకిళ్లపై వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు సింహం ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. చివరకు సిబ్బంది దానిని సురక్షితంగా తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి పంపినట్లు సమాచారం. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో వన్యప్రాణిని ఇలా వెంబడించడం సరికాదంటూ జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ఇన్‌ఛార్జి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మితేశ్ వనియా స్పందించారు. సింహాన్ని సిబ్బంది వేధించారనే ఆరోపణలను ఆయన ఖండించారు. దానిని సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లేందుకే ప్రయత్నించారని వివరించారు. సుమారు 300 హెక్టార్లలో విస్తరించిన ఈ పార్కులో 'క్రాల్' పేరుతో 100×100 మీటర్ల ప్రత్యేక ప్రాంతం ఉందని, ప్రతిరోజూ సాయంత్రం అక్కడ వన్యప్రాణులకు ఆహారం అందిస్తారని తెలిపారు. ఘటన జరిగిన రోజు సింబా అనే సింహం ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోవడంతో సిబ్బంది దానిని తిరిగి ఎన్‌క్లోజర్ వైపు మళ్లించారని చెప్పారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జీపును ఉపయోగిస్తారని, అయితే ఆ రోజు సిబ్బంది బైక్‌లను వినియోగించారని వెల్లడించారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టి, ఇందులో పాల్గొన్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!