

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ స్థానాలను పెంచేందుకు కేంద్రం బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాల సంఖ్యను కూడా పెంచాలా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్‌సభ స్థానాల గరిష్ఠ పరిమితి 550 కాగా, ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ స్థానాల గరిష్ఠ పరిమితి 250గా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న నిష్పత్తి ప్రకారం లోక్‌సభ స్థానాలు 850కి పెరిగితే రాజ్యసభ స్థానాలు కూడా సుమారు 386–387కి చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్టికల్ 80ను సవరించాల్సి ఉన్నప్పటికీ, కేంద్రం ప్రతిపాదనల్లో దీనిపై ప్రస్తావన లేకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఆర్టికల్ 171(1) ప్రకారం రాష్ట్ర శాసనమండలిలో సభ్యుల సంఖ్య కనీసం 40గా, గరిష్ఠంగా సంబంధిత శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడో వంతుకు మించకుండా ఉండాలి. అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఈ నిబంధన మేరకు శాసనమండలి స్థానాలను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య నిష్పత్తిని మార్చాలనుకుంటే ఆర్టికల్ 171(1)ను సవరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 1,352 అసెంబ్లీ స్థానాలు, 426 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరిగితే వాటి సంఖ్య 2,028కు చేరుతుంది. ప్రస్తుత నిష్పత్తిని కొనసాగిస్తే ఎమ్మెల్సీ స్థానాలు సుమారు 639కి పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, శాసనమండలిలో కనీసం 40 మంది సభ్యులు ఉండాలన్న నిబంధన కారణంగా ఇప్పటివరకు 120 కంటే తక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో మండళ్ల ఏర్పాటుకు అవకాశం పరిమితమైంది. తాజా ప్రతిపాదనలతో ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు 120 దాటే అవకాశం ఉండటంతో అక్కడ కూడా శాసనమండళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం కావచ్చు. అస్సాం, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ శాసనమండళ్ల ఏర్పాటుకు తగిన అసెంబ్లీ బలం ఉన్నప్పటికీ, ఆయా ప్రభుత్వాలు ఇప్పటివరకు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపితే దేశంలో శాసనమండళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!