

కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణతో భారత ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని నాస్‌కామ్ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అప్లికేషన్ మెయింటెనెన్స్, ఐటీ మౌలిక సదుపాయాల నిర్వహణ, కాల్ సెంటర్ కార్యకలాపాల వంటి సంప్రదాయ సేవలపై ఏఐ ఆటోమేషన్ ప్రభావం చూపనుందని పేర్కొంది. కోడ్ విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, సాధారణ ఐటీ నిర్వహణ పనులను ఏఐ వేగంగా పూర్తి చేస్తుండటంతో ఈ విభాగాల్లో మానవ జోక్యం తగ్గనుంది. ముఖ్యంగా ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. సంభాషణ ఆధారిత ఏఐ, ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థల కారణంగా సంప్రదాయ కాల్ సెంటర్ సేవల గిరాకీ కూడా తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది.
అయితే ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వ్యయాలు తగ్గడంతో చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని నాస్‌కామ్ తెలిపింది. పాత సాంకేతిక వ్యవస్థల ఆధునికీకరణకు అయ్యే సమయం, ఖర్చులు తగ్గడం కూడా కొత్త వ్యాపార అవకాశాలకు దోహదపడనుంది. ఇకపై ఉద్యోగుల సంఖ్యను అదే స్థాయిలో పెంచకుండానే ఐటీ కంపెనీలు ఆదాయాన్ని, వ్యాపార పరిధిని విస్తరించుకునే అవకాశం ఉంది. ఏఐ ప్రభావానికి అనుగుణంగా కంపెనీలు తమ సేవలను పునర్‌వ్యవస్థీకరించుకుంటూ కొత్త నైపుణ్యాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, ఇంటెలిజెంట్ బిజినెస్ ఆపరేషన్స్, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాలు భవిష్యత్తులో ఐటీ రంగానికి కొత్త వృద్ధి చోదకాలుగా మారనున్నాయని నివేదిక పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!