

దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రతిపాదన భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. శనివారం దిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే కేంద్రం ప్రభావంలో ఉందని, ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్‌నూ తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కులగణనను పక్కనపెట్టి, జనాభా లెక్కలు పూర్తికాకముందే డీలిమిటేషన్ చేపట్టడం సరికాదని అన్నారు.
ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలనే కొనసాగించాలని, 2027 జనాభా లెక్కల వివరాల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో కులగణన వివరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, నిష్పాక్షికంగా వ్యవహరించే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏ రాష్ట్రానికీ ప్రస్తుత స్థానాల వాటాలో మార్పు ఉండకూడదని, 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఓబీసీలకు ఉప కోటా కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ కూటమి భాగస్వాములతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత జగన్, భాజపా మిత్రపక్షాలు కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తాజా బిల్లులపై ఎవరు ప్రజాస్వామ్యానికి అండగా నిలుస్తారో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!