

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మొత్తం ఏడుగురు యాత్రికుల్లో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు మంత్రికి తెలిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదని వెల్లడించారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద శశికుమార్ చివరిసారిగా కనిపించినట్లు అధికారులు తెలిపారు.
మిస్సైన ముగ్గురి ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!