

మహారాజా అగ్రసేన్ ఆశయాలు సమాజ సమగ్రాభివృద్ధికి నేటికీ దిక్సూచిగా నిలుస్తున్నాయని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం, ప్రజాసంక్షేమం వంటి విలువలను ఆచరిస్తూ సమాజ శ్రేయస్సు, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహారాజా అగ్రసేన్ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు–2026కు ఆయన తన సతీమణి జానకి శుక్లాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అగర్వాల్, అగ్రహరి సమాజాల ప్రముఖులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
మహారాజా అగ్రసేన్ బోధనలు సామాజిక ఐక్యత, సమ్మిళిత అభివృద్ధికి మార్గదర్శకమని గవర్నర్ పేర్కొన్నారు. అగర్వాల్ సమాజం వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు, దాతృత్వం, సామాజిక సేవలో అందిస్తున్న సేవలను కొనియాడారు. ‘మానవ సేవే మాధవ సేవ’, ‘సర్వే సుఖినో భవంతు’ వంటి భారతీయ విలువలను ఆచరణలో పెట్టాలని, యువతకు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలని సూచించారు. నూతన వ్యాపారాలు, పారిశ్రామిక కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతూ ఆర్థిక ప్రగతిని సామాజిక బాధ్యతతో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అఖిల భారతీయ వైశ్య సమ్మేళనం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. గిరీష్ కుమార్ సంఘీ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!