

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రపై ప్రతికూల ప్రభావం లేకపోతే గతంలో కుదిరిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు అభ్యంతరం లేదని, తెలంగాణ నీటి అవసరాలకు సహకరిస్తామని తెలిపారు. ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం ఫడణవీస్‌తో సమావేశమైంది. నీటి లభ్యత, బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై చర్చించారు. కేంద్ర జలసంఘం అధ్యయనంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించాలని ఫడణవీస్ ప్రతిపాదించారు.
సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. 2016లో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని, అయితే ఆ ఎత్తుతో తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని తెలిపారు. నీటిని గ్రావిటీ ద్వారా తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనా అంశాలను పరిశీలించి, తదుపరి సమావేశాలు మరియు కార్యాచరణ ప్రణాళికపై స్పష్టత తీసుకురావాలని ఇరు రాష్ట్రాల నేతలు అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!