

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఢిల్లీలో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో ఆయన విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, ఈ అంశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2013 భూసేకరణ, పునరావాస చట్టం వంటి చర్యలను కూడా ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ సేవలు, ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఆయన వారసత్వాన్ని కాపాడాలని సీఎం అన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!