

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ఎన్విడియా హనీ ట్రాప్ వివాదాన్ని ప్రస్తావించిన కంగనా.. గాంధీ కుటుంబంలోకి ఓ “అనుమానాస్పద విదేశీయురాలు” ప్రవేశించిందంటూ వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాల వెనుక జరిగిన పరిణామాలను ప్రశ్నిస్తూ, ఈ ఘటనల క్రమంలో ఎన్నో అనుమానాస్పద యాదృచ్ఛికాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన సినిమా ఎమర్జెన్సీ నిర్మాణ సమయంలో గాంధీ కుటుంబ చరిత్రపై చేసిన పరిశోధన ఆధారంగానే ఈ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో విదేశీ అజెండాలను ప్రోత్సహించారని కూడా కంగనా ఆరోపించారు.
కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆరోపణలతో కూడుకున్నవి కావడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే, గాంధీ కుటుంబ సభ్యుల మరణాలతో సోనియా గాంధీకి సంబంధం ఉందని లేదా ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని నిరూపించే ఆధారాలను కంగనా తన పోస్టుల్లో వెల్లడించలేదు. చారిత్రక రికార్డుల ప్రకారం, సంజయ్ గాంధీ 1980లో విమాన ప్రమాదంలో మరణించగా, ఇందిరా గాంధీ 1984లో తన భద్రతా సిబ్బందిలోని ఇద్దరి చేతిలో హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ 1991లో బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. ఈ మూడు ఘటనలు వేర్వేరు సందర్భాల్లో చోటుచేసుకున్నవే. కంగనా వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి రాజకీయ, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆమె చేసిన ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా భావించకూడదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!