

దక్షిణ కొరియాలో సముద్రం నుంచి కొట్టుకొచ్చిన భారీ షార్క్ కృత్రిమ జలమార్గంలో చిక్కుకోవడంతో అది పెద్ద ఆకర్షణగా మారింది. బుసాన్ నార్త్ పోర్ట్ వాటర్‌ఫ్రంట్ పార్క్‌లోని కృత్రిమ కాలువలోకి సెప్టెంబర్ 18న ఈ షార్క్ ప్రవేశించింది. దానిని గుర్తించిన అధికారులు అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ‘బుకాంగ్-ఇ’గా పేరు పెట్టిన ఈ సొరచేప అంతరించిపోతున్న జాతికి చెందిన ఆడ డస్కీ షార్క్‌గా గుర్తించారు. దాని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. ఈ షార్క్‌ను చూసేందుకు కేవలం 18 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
షార్క్‌ను తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అది ప్రస్తుతం కాలువలోనే తిరుగుతోంది. దీంతో అది స్వయంగా సముద్రం వైపు వెళ్లేంత వరకు వేచి చూడాలని అధికారులు నిర్ణయించారు. అప్పటికీ కాలువను వీడకపోతే వలల సాయంతో సురక్షితంగా పట్టుకుని సముద్రంలోకి విడిచిపెడతామని తెలిపారు. మరోవైపు ఈ షార్క్ స్థానిక వ్యాపారులకు కూడా కలిసొచ్చింది. సందర్శకులను ఆకర్షించేందుకు షార్క్ బొమ్మలు, ఇతర జ్ఞాపిక వస్తువులను విక్రయిస్తూ వారు ఆదాయం పొందుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!