

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, కుమారుడు, కోడలితో కలిసి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆమెతో పోలీసులు చర్చించారు. యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని, కోర్టు ఆదేశాలను పాటించాలని సూచించారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన షర్మిల వాహనాలను యలహంక వెళ్లే మార్గంలోకి అనుమతించకుండా బెంగళూరు నగరం వైపు మళ్లించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఓ ప్రైవేటు హోటల్‌కు వెళ్లారు. షర్మిల బెంగళూరు వస్తున్న సమాచారం ముందుగానే అందడంతో విమానాశ్రయం, యలహంక ప్యాలెస్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ప్రవేశించకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జగన్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి భీమిశెట్టి రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌లో.. వైఎస్ భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ 2007 మార్చి 1న 20 ఏళ్ల కాలానికి ప్యాలెస్‌ను తమ సంస్థకు లీజుకు ఇచ్చారని పేర్కొన్నారు. ప్యాలెస్ అభివృద్ధికి భారీగా ఖర్చు చేసినట్లు సంస్థ తరఫు న్యాయవాది సుధీర్ మేడమ్మయ్య వాదించారు. 2026 ఆగస్టు 27న సుగుణమ్మ ఈ ఆస్తిని భారతి, మనుమరాళ్లకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారని తెలిపారు. అలంకరణ పనుల పేరుతో షర్మిల బయట వ్యక్తులను ప్యాలెస్‌లోకి అనుమతిస్తున్నారని, దీనివల్ల భవనాలు, పండ్ల చెట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి షర్మిల, ఆమె అనుచరులను ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!