

2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై జరిగిన 26/11 ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తయ్యాయి. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన లష్కరే తయ్యిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు నగరంలోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ), తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆసుపత్రి ప్రాంతాల్లో కాల్పులు జరిపి, పలువురిని బందీలుగా పట్టుకున్నారు. దాదాపు 60 గంటలపాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. నవంబరు 29 వరకు కొనసాగిన ఎదురుకాల్పులకు ముంబయి పోలీసులు, సాయుధ బలగాలు, నేవీ మెరైన్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సంయుక్తంగా ముగింపు పలికాయి. ఈ దాడులు దేశ తీరప్రాంత భద్రత, నిఘా వ్యవస్థల్లోని లోపాలను వెలుగులోకి తెచ్చాయి. అనంతరం సముద్ర మార్గాల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణ, ఉగ్రవాద నిరోధక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు సీఎస్‌ఎంటీ, కామా ఆసుపత్రి సహా పలు ప్రాంతాల్లో ప్రజలు నివాళులర్పిస్తున్నారు.
మరోవైపు, దాడుల సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీర్ ఉర్ రెహమాన్ లఖ్వీ సహా పలువురిపై చర్యల విషయంలో పురోగతి లేదని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రత్యేక కోర్టు జారీ చేసిన ప్రకటన ఉత్తర్వుల అమలుకు కేంద్ర హోంశాఖను కోరినా స్పందన రాలేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరఫున బాంబే హైకోర్టులో వాదించిన న్యాయవాదులు అమిన్ సోల్కర్, ఫర్హానా షాలకు ఇప్పటికీ పూర్తి పారితోషికం అందలేదు. 2010లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వీరు తొమ్మిది నెలలపాటు ఇతర కేసులను పక్కనపెట్టి కసబ్ తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారికి నిర్దేశించిన స్థాయిలో ఫీజులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, బిల్లులు, కోర్టు తేదీలు, అక్కడ గడిపిన గంటల వివరాలతో మెమోలు సమర్పించాలని న్యాయ సేవాధికార సంస్థ కోరుతోందని వారు చెబుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత రోజువారీ వివరాలు ఇవ్వాలని కోరడం సమంజసం కాదని న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం బిల్లులు తప్పనిసరని అధికారులు పేర్కొంటున్నారు. కసబ్ తరఫున ట్రయల్ కోర్టులో వాదించిన అబ్బాస్ కాజ్మీకి మాత్రం పారితోషికం సకాలంలో అందినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!