

ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల ద్వారా ఫారం-6ను సవరించారంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఎస్ఐఆర్ ఆదేశాల్లో భాగంగా జతచేసిన డిక్లరేషన్ అనేది ఫారం-6లో భాగం కాదని, అది ఒక ప్రత్యేక పత్రమని ఈసీ తన అఫిడవిట్లో వివరించింది. దరఖాస్తుదారుల అర్హతను సులభంగా నిర్ధారించేందుకే ఈ ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తుదారులు తమ కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు/తాతయ్యలు) వివరాలను గత ఓటర్ల జాబితాలతో అనుసంధానించవచ్చని, దీనివల్ల అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది. ఫారం-6ను సవరించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని, తమకు లేదని స్పష్టం చేసింది.
ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం నొక్కి చెప్పింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఇతర కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ముగ్గురూ కలిసి ఆమోదించిన తర్వాతే ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది. కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలను ఖండించింది. ఫైళ్లు ఒక కమిషనర్ నుంచి మరో కమిషనర్‌కు, చివరకు సీఈసీ వద్దకు వెళ్తాయని, ముగ్గురి సంతకాలతోనే నిర్ణయాలు అమలవుతాయని తమ అంతర్గత ప్రక్రియను వివరించింది.
కేవలం వార్తాపత్రికల కథనాలను ఆధారంగా చేసుకుని దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని ఈసీ సుప్రీంకోర్టును కోరింది. చట్టప్రకారం వార్తా కథనాలకు సాక్ష్యంగా ఎలాంటి విలువ ఉండదని వాదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలోనే తాము వ్యవహరించామని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!