

తమిళనాడులో అన్నాడీఎంకే అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నాయకత్వాన్ని సవాలు చేసేందుకు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం వర్గాలు వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షణ్ముగం మద్దతుదారులుగా భావిస్తున్న సుమారు 100 మందిని పార్టీ నుంచి తొలగించినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న పరాజయాలపై చర్చ జరుగుతున్న వేళ, ప్రముఖ నటుడు ధనుష్‌ను అన్నాడీఎంకేలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు ఆసక్తి రేపుతున్నాయి. స్వతంత్రంగా రాజకీయాల్లోకి వస్తే బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడం ధనుష్‌కు సవాలుగా మారవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉన్న అన్నాడీఎంకే ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించవచ్చనే చర్చ సాగుతోంది.
వస్తున్న కథనాల ప్రకారం.. యువతను పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు, నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో ధనుష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పళనిసామి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పళనిసామి కుమారుడు మిథున్, ధనుష్ మధ్య ఇప్పటికే మూడుసార్లు ప్రాథమిక చర్చలు జరిగినట్లు అన్నాడీఎంకే వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ధనుష్‌కు జాయింట్ జనరల్ సెక్రటరీ లేదా యువజన విభాగ కార్యదర్శి వంటి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశంపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ సైతం ధనుష్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే, ధనుష్ రాజకీయ ప్రవేశం, చర్చలు, పదవుల కేటాయింపుపై అధికారిక ధ్రువీకరణ లేదు. ఈ పరిణామాల వెనుక బీజేపీ వ్యూహం ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నప్పటికీ, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!