

శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలను నవంబర్ 1 నుంచి ఢిల్లీలోకి అనుమతించరు. ఈ ఆంక్షలు 2027 జనవరి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలోని 10 లక్షలకు పైగా వాహనాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
రవాణా శాఖ అంచనాల ప్రకారం.. హరియాణాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాల్లో బీఎస్-6 ప్రమాణాలు లేని వాహనాలు దాదాపు 2 లక్షలు ఉన్నాయి. వీటిలో 70 శాతం వరకు బీఎస్-3, బీఎస్-4 వాహనాలే. అలాగే, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 4లక్షలకు పైగా వాహనాలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. ఆంక్షలను అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను కఠినతరం చేయనున్నారు. వాహనాల నంబర్ ప్లేట్లను ఆటోమేటిక్‌గా గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాలను కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు. ఏఐ ఆధారిత కెమెరాల సాయంతో నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించనున్నారు. బీఎస్-6 ప్రమాణాలు లేని వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భౌతిక తనిఖీల ద్వారా కూడా అడ్డుకోనున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!