

ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచార సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ అనే మహిళతో సంబంధాలున్నాయనే ప్రచారంపై కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపేందుకు వాచెల్, లిప్టన్, రోసెన్ అండ్ కట్జ్ (Wachtell, Lipton, Rosen & Katz) అనే న్యాయ సంస్థను నియమించింది. కార్పొరేట్ వివాదాలు, క్లిష్టమైన న్యాయపరమైన కేసుల దర్యాప్తులో ఈ సంస్థకు మంచి పేరుంది. ఈ సంస్థలో పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న జూన్ హెచ్. కిమ్ గతంలో న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌లో అటార్నీగా పనిచేశారు. 2021లో మాజీ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన దర్యాప్తు చేశారు. ఈ వ్యవహారంపై కంపెనీ బోర్డు సమీక్ష నిర్వహిస్తుందని ఎన్విడియా ఇప్పటికే ప్రకటించింది. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలు లేదా కంపెనీ రహస్య సమాచారం లీకైనట్లు తాము భావించడం లేదని స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బోర్డు పూర్తిగా పరిశీలిస్తుందని, ఈ సమీక్షకు జెన్సన్ హువాంగ్ పూర్తిగా సహకరిస్తారని తెలిపింది.
మరోవైపు, ఈ వ్యవహారంపై ఎన్విడియా ఇన్వెస్టర్ల నుంచి కఠిన ప్రశ్నలను ఎదుర్కొంటోంది. అలిస్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సంబంధం గురించి వాటాదారులను కంపెనీ తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ, హువాంగ్‌తో పాటు ఎన్విడియాపై కాలిఫోర్నియా కోర్టులో వాటాదారులు దావా వేశారు. కంపెనీ బోర్డులోని మొత్తం 10 మంది సభ్యులకు హువాంగ్‌తో దీర్ఘకాలిక వృత్తిపరమైన సంబంధాలు ఉన్నట్లు వచ్చిన సమాచారం కూడా స్వతంత్ర దర్యాప్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ ఆరోపణల ప్రభావం ఎన్విడియా షేర్లపైనా కనిపిస్తోంది. మంగళవారం అమెరికా మార్కెట్లో కంపెనీ షేర్లు 6 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా ఉన్న ఎన్విడియా ఆ స్థానాన్ని కొద్దిసేపు కోల్పోయి మైక్రోసాఫ్ట్‌కు అప్పగించింది. గతేడాది జూన్ తర్వాత ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. స్వతంత్ర దర్యాప్తు, వాటాదారుల దావాతో ఎన్విడియాపై ఒత్తిడి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!