

ఇంధన ధరల పెరుగుదల, సరఫరా అంతరాయాలతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి కఠిన పొదుపు, ఇంధన సంరక్షణ చర్యలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న క్యాబినెట్ డివిజన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకు మూసివేయాలి. వివాహ మందిరాలు, ఇతర ఈవెంట్ వేదికలు రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్‌లెట్లు రాత్రి 11 గంటలకు మూసివేయాలి. అయితే టేక్‌అవే, హోమ్ డెలివరీ సేవలకు మినహాయింపు ఇచ్చారు. పెళ్లి వేడుకల్లో ఒకే వంటకం వడ్డించాలని, ప్రభుత్వ వాహనాల ఇంధన కేటాయింపులను మూడు నెలల పాటు 50 శాతం తగ్గించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ శాఖలు కొత్త వాహనాల కొనుగోళ్లను తగ్గించడంతో పాటు, మంత్రులు, పార్లమెంటేరియన్ల విదేశీ పర్యటనలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించాయి. అవసరం లేని అధికారిక విందులు, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా నియంత్రణలు పెట్టారు. మరోవైపు సెప్టెంబర్ 18 నుంచి పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరను లీటరుకు 43 పైసలు తగ్గించి రూ.390.79గా నిర్ణయించగా, హైస్పీడ్ డీజిల్ ధరను రూ.3.47 పెంచి రూ.424.92కు చేర్చారు. పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించేందుకు అర్హత ఉన్న మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చిన్న వాహనాలకు లీటరుకు రూ.100 వరకు లక్ష్యిత ఇంధన సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!