

ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని వైశాలి జిల్లాలో గంగా నదిపై నిర్మించిన ఆరు లేన్ల కచ్చీ దర్గా–రాఘవ్‌పూర్–బిడుపుర్ బ్రిడ్జిని ప్రారంభించారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గౌరవార్థం ఈ వంతెనకు ‘నితీశ్ సేతు’గా పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌధరి పాల్గొన్నారు. వంతెనను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖులు దానిపై నడిచారు. ఈ కార్యక్రమానికి ముందు పట్నా విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి మాజీ సీఎం నితీశ్ కుమార్ స్వాగతం పలికారు. నితీశ్ కుమార్‌ను కలవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొంటూ మోదీ ఎక్స్‌లో ఫొటోలను పంచుకున్నారు.
గంగా నదిపై ఈ వంతెనను రూ.4,280 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం 19.7 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి పట్నా జిల్లాలోని జాతీయ రహదారి 22పై ఉన్న కచ్చీ దర్గాను, వైశాలి జిల్లాలోని జాతీయ రహదారి 322పై ఉన్న బిడుపుర్‌తో అనుసంధానిస్తుంది. ఇందులో 9.7 కిలోమీటర్ల ప్రధాన వంతెనతో పాటు 10 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. కేబుళ్ల ఆధారిత నిర్మాణ పద్ధతిలో రూపొందించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో పట్నా–వైశాలి మధ్య ప్రయాణ సమయం 20 నుంచి 25 నిమిషాలకు తగ్గనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ ట్యూబ్రో (L&T), దక్షిణ కొరియాకు చెందిన డైవూ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!